పెత్తందారుల చెరలో పేదల నివేదనలు... ఆక్రమణల వెనుక అధికారుల అండదండలు?
ఓబులవారిపల్లి సెప్టెంబర్ 8 జై భీమ్ వాయిస్ టుడే:
ఓబులవారిపల్లి మండలంలో జిల్లా హరిజన అభివృద్ధి కమిటీ కేటాయించిన భూముల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం ధారాదత్తం చేసిన హక్కులను స్థానిక పెత్తందారులు విచక్షణారహితంగా తొక్కిపెడుతుంటే, రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారిక సర్వే విధానాన్ని తుంగలో తొక్కి, ప్రైవేటు సర్వేర్లను తెరపైకి తెచ్చి సరిహద్దులు తారుమారు చేస్తున్న తీరుపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల ముడుపులు చేతులు మారుతూ సాగుతున్న ఈ అక్రమాలు అధికారులకు తెలిసే జరుగుతున్నాయా అనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఈ భూములు కేవలం పేదల సాగుబడికి మాత్రమే చెందుతాయని, వీటిని ఇతరులకు కౌలుకు ఇవ్వడం లేదా బదిలీ చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ అక్రమార్కులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.
ప్రైవేట్ దందాను అరికట్టి, చట్టవిరుద్ధంగా సరిహద్దులు మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు నినదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తక్షణమే దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని, భూములను క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించి నిజమైన లబ్ధిదారులకు అధికారికంగా సరిహద్దు రాళ్లు పాతాలని పట్టుబడుతున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా క్షేత్రస్థాయికి వచ్చి న్యాయం చేయకపోతే ప్రజాసంఘాల అండతో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
Andhra
పెత్తందారుల చెరలో పేదల నివేదనలు... ఆక్రమణల వెనుక అధికారుల అండదండలు?
Quick Summary:
పెత్తందారుల చెరలో పేదల నివేదనలు... ఆక్రమణల వెనుక అధికారుల అండదండలు?